శాసన వ్యవస్థకు పరీక్ష!

21-09-2026 | 05:50am

దానంపై హైకోర్టు వేటుతో సరికొత్త సవాల్ 

కథ సుప్రీంకోర్టుకు చేరడంతో మరింత హీట్

  1. స్పీకర్ నిర్ణయాధికారాలు, న్యాయవ్యవస్థ సమీక్షలపై చర్చ 
  2. కోర్టుల జోక్యానికి అవకాశమిస్తున్న శాసన పరిణామాలు
  3. ఫిరాయింపు కేసుల్లో కాలపరిమితి ఉండాలంటున్న విశ్లేషకులు 
  4. సుప్రీం విచారణపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే(Khairatabad MLA) దానం నాగేందర్‌(Danam Nagender)పై హైకోర్టు అనర్హత వేటు వేయ డం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. బీఆర్‌ఎస్ టికెట్‌(BRS ticket)పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరి, అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Election)ల్లో పోటీ చేయడం చుట్టూ మొదలైన వివాదం.. చివరికి స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం, ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటిం చడం వరకు వెళ్లింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు(High Court Verdict)ను సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే, దానం నాగేందర్ అనర్హత ఒక్క ఎమ్మెల్యే పదవికి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే కాకుండా.. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయ పరిమితి, ఆ నిర్ణయంపై కోర్టులు ఏ స్థాయిలో జోక్యం చేసుకోవచ్చు? రాజకీయంగా కీలకమైన కేసుల్లో స్పీకర్ నిష్పాక్షికత ఏమిటి.. అనే అంశాల చుట్టూ పొలిటికల్  హీట్ పెరిగింది. ప్రస్తుతం దానంపై అనర్హత వేటు కంటే స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చుట్టూ చర్చ సాగుతున్నది. 

నిర్ణయాధికారం స్పీకర్‌దే.. కానీ?!

పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులపై అనర్హతకు సంబంధించి నిర్ణ యం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉం టుంది. కానీ, దానం కేసులో జరిగిన పరిణామం శాసన వ్యవస్థకు సవాల్‌గా మారింది. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు.. ఆ నిర్ణయాన్ని హైకోర్టు సమీక్షిం చింది.. చివరకు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించింది. దీంతో స్పీకర్ నిర్ణయాధికారాల పరిధిపై ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతున్నది. 

శాసన సభాపతిగా ఎన్నికైనవారు మొత్తం సభకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే, ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్ నిర్ణయం నేరుగా రాజకీ య బలాబలాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధికార పక్షంలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో ఈ నిర్ణయాలకు రాజకీయ ప్రా ధాన్యం పెరుగుతుంది. అందుకే ప్రతిపక్షా లు తరచూ స్పీకర్ నిర్ణయాలపై అధికారపక్ష ప్రభావం ఉంటోందని ఆరోపణలు చేస్తుంటాయి. దానం కేసులో హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో స్పీక ర్ నిర్ణయాల్లో పారదర్శకత, కారణబద్ధత, కాలపరిమితి, నిష్పాక్షికతపై చర్చను మాత్రం మరింత పెంచింది. 

స్పీకర్ జాప్యం.. కోర్టుల జోక్యం!

వాస్తవానికి ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యమైతే కోర్టుల జోక్యానికి అవకాశం పెరుగుతుంది. బీఆర్‌ఎస్ నుం చి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన తర్వాత.. నిర్ణయాలు ఆలస్యమయ్యాయని పేర్కొంటూ పిటిషనర్లు మొదట హైకోర్టును ఆశ్రయించారు. ఈ వి వాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. 2025 జూలైలో సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ మూడు నెలల్లో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం లో జరిగిన ఆలస్యాన్ని కోర్టు పరిశీలించింది. ఒకవైపు రాజ్యాంగం స్పీకర్‌కు అధికారాన్ని ఇస్తే.. మరోవైపు ఆ అధికారాన్ని వినియోగించడంలో జాప్యం జరిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దా నం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం శాసన వ్యవస్థకు ప్రశ్నగా మారింది. 

పాలక పక్షానికి సవాల్.. ప్రతిపక్షాలకు ఆయుధం..

దానం నాగేందర్ వ్యవహారం కాంగ్రెస్‌కు ప్రస్తుతం రాజకీయంగా కూడా సవాల్‌గా త యారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎ మ్మెల్యేలు కాంగ్రెస్ బాటపట్టారు. వారిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని స్పీకర్ దశలవారీగా విచారించి.. తిరస్కరించారు. దానం కేసులో మాత్రం హైకోర్టు ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా ఇదే అంశం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఫిరాయింపుల రాజకీయాలపై బీఆర్‌ఎస్ గత రికార్డును ప్రస్తావిస్తూ తమ వాద నను వినిపిస్తున్నారు. 

మరోవైపు బీఆర్‌ఎస్ మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. తర్వాత వారు మరో పార్టీ లో చేరడాన్ని ప్రజా తీర్పును విస్మరించడం గా చిత్రీకరిస్తున్నది.  అయితే దానం అనర్హత తీర్పును బీఆర్‌ఎస్ స్వాగతించింది. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇ దే పరిణామం వస్తుందని కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. హైకోర్టు తాజా తీర్పుతో.. ఇప్పటికే స్పీకర్ తిరస్కరించిన మి గితా పిటిషన్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

దానం కేసును బీఆర్‌ఎస్‌తో పాటు బీజే పీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. వీటిని విచారించిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయా న్ని కొట్టివేస్తూ.. దానంపై అనర్హత వేటు వేసింది. ఇప్పుడు దానం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ కేవియెట్లు దాఖలు చేశాయి. దానం పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్త ర్వులు ఇవ్వకూడదన్నది కోరాయి. 

మిగిలిన ఎమ్మెల్యేల సంగతేంది?

దానం నాగేందర్ కేసు తీర్పు తర్వాత అం దరి దృష్టి మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పై పడింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై వివిధ దశల్లో అనర్హత పిటిషన్లు వచ్చాయి. ఇప్పుడు దానం కేసులో స్పీకర్ నిర్ణయాన్ని  హైకోర్టు కొట్టివేయడం, దానంపై అనర్హత వేటు  వేయడం తో మిగిలిన కేసులపై ఉత్కంఠ పెరిగింది. మిగిలిన తొమ్మిది మందిలో కడియం శ్రీహరి మినహా ఎనిమిది మంది విషయం లో హైకోర్టు తీర్పు ప్రభావం ఏ విధంగా ఉం టుందనే ఆసక్తికరంగా మారింది.

కడియం శ్రీహరి బీ ఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి న తర్వాత.. ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ  ఎన్నికల్లో కావ్య తరఫున కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం చేశారు. ఇది కడియం శ్రీహరి కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటే ఆయనపై కూడా అనర్హత వేటు పడొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

సుప్రీం ఏం చెప్పనుంది?

తనపై హైకోర్టు అనర్హత వేటు వేయడా న్ని సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీం ఎలా స్పందిస్తుంది? హైకోర్టు తీర్పు కొనసాగుతుందా? ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరిగే పరిస్థితి ఏర్పడుతుందా? దానం సభ్యత్వంపై తుది న్యాయ నిర్ణయం ఏమిటి? వంటి అంశాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చకు వస్తున్నాయి. స్పీకర్, శాసన వ్యవస్థలోని నిర్ణయాలపై న్యాయ వ్యవస్థ ఎలా రియాక్ట్ అవుతుందనేదీ కీలకంగా మారింది. ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్ నిర్ణయాధికారాలు ముఖ్యంగా చర్చకు వస్తున్నాయి.

స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానాలు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి?, ఆ నిర్ణయాల్లో జాప్యం జరిగితే.. కోర్టులు కాలపరిమితి విధింపు వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే స్పీకర్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా, రాజకీయ ప్రభావ ఆరోపణలకు తావివ్వకుండా పిటిషన్లపై తప్పనిసరి కాలపరిమితి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాసన వ్యవస్థలో నిర్ణయాలు పారదర్శకంగా వెలువడకపోతే న్యాయస్థానాల జోక్యానికి అవకాశాలు పెరుగుతాయని వారు అంటున్నారు.    

మరిన్ని వార్తలు