ఖైరతాబాద్‌లో గెలుపు బీజేపీదే
- ‘దానం’కు ఉప ఎన్నికలు కలిసిరావు
- అధికారంలో ఉన్న పార్టీకి మారడం అలవాటు
- కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ నయా నిజాంలు
- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఖైరతాబాద్(Khairatabad)లో బీజేపీ గెలుపు ఖాయమని, దానం నాగేందర్(Danam Nagender)కు ఉప ఎన్నికలు అచ్చివచ్చినట్లు ఎక్కడాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు(Raghunandan Rao) జోస్యం చెప్పారు. గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారని పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాల ఆయన మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ గతంలోనూ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని తెలిపారు. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తే మళ్లీ ఆయనకు ఓటమి తప్పదని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్, రేవంత్(KCR, Revanth) ఇద్దరూ.. నయా నిజాంలు
భూముల రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా.. జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse)కు వెళ్ళి చూడటం ఎందుకని రఘునందన్‌రావు ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో వెళ్లడం అవసరమా?, అధికార దుర్వినియోగం తప్ప ఏమి లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అసమర్థ సీఎం పాలన, ప్రతిపక్ష పార్టీ నాటకం ఆడారని విమర్శించారు. కేసీఆర్, రేవంత్ మాటలకు తేడా లేదని, ఇద్దరూ ఎంఐఎం బానిసగా ఓల్డ్ సిటీకి వెళ్ళి పొగుడుతున్నారని విమర్శించారు.
నగ్నంగా మహిళలతో బతుకమ్మలు ఆడించడమే కాకుండా బైరాన్‌పల్లిలో ఒక మగ వ్యక్తి లేకుండా కాల్చి చంపించిన నిజాం ఎలా గొప్పవాడవుతారని ప్రశ్నించారు. శాసనసభలో పొగడటానికి ఆ ఇద్దరికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. నిజాం గొప్పోడయితే పటేల్ చేసిన ఆపరేషన్ పోలో తప్పా? అని ప్రశ్నించారు.
కొమురం భీమ్, రాంజీ గోండు చేసిన ఉద్యమాలు తప్పా? అని నిలదీశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ నయా నిజాంలన్నారు. వారిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నాడు కేసీఆర్ వెంట, నేడు కాంగ్రెస్ వెంట నడిచిన తోకపార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని విమర్శించారు. అసెంబ్లీలో ఆ రెండు పార్టీల డ్రామాలు ఒకేరకంగా ఉన్నాయన్నారు.