జొన్నల కొనుగోళ్లలో గోల్‌మాల్..
- ఆరుగాలం రైతుల కష్టం... బిల్లు చెల్లింపులో కోత..
- దాదాపు 600 క్వింటాళ్ల జొన్నలు మాయం..
- తక్కువ డబ్బులు రావడంతో అన్నదాతల ఆందోళన..
ఉట్నూర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గత రబీ సీజన్ లో (Rabi season)రైతులు కష్టపడి పండించిన జొన్న పంటను మద్దతు ధరకు విక్రయించిన రైతులకు అమ్మిన పంటకు సరైన డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు.
ఆరు కాలం కష్టపడి జొన్న పంట సాగు చేసి పిఎసిఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్న పంటలకు నాలుగు నెలల తర్వాత చెల్లిస్తున్న డబ్బులలో ఒక్కొక్క రైతుకు రూ. 10 వేల నుండి 20వేల రూపాయలకు పైగా బిల్లులో కోత విధించి, బ్యాంక్ అకౌంట్ లలో డబ్బులు అధికారికంగా జమ చేస్తున్నారు.
కష్టపడి పండించిన జొన్న పంటలను అమ్మిన రైతులు బ్యాంక్ ఖాతాలో చూస్తే అమ్మిన జొన్న పంటలకు సరిపడా డబ్బులు వేయకుండా మూడు క్వింటాల్ నుండి 8 క్వింటాళ్ల జొన్న పంటను కోత విధించి డబ్బులు వేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతుల పేరుతో వ్యాపారులు అమ్మిన జొన్న పంటలకు వారికి సరిపడా డబ్బులను బ్యాంకు ఖాతాలో వేశారని, రైతులు అమ్మిన పంటకు సరిపడా డబ్బులు వేయకుండా, తక్కువ డబ్బులు బ్యాంక్ ఖాతాలో వేసి రైతులను దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వపరంగా కొనుగోలు చేసిన జొన్న పంటలో దాదాపుగా 600 క్వింటాళ్లకు పైబడి జొన్నలు అమ్మకుండా బిల్లులు చేసి పక్కదారి పట్టించిన విషయం ను మార్క్ఫెడ్ అధికారులు గుర్తించి జొన్నలు కొనుగోలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రైతులు అమ్ముకున్న పంటను తక్కువ చేసి బ్యాంక్ ఖాతాలో తక్కువ డబ్బులు వేయడం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి జొన్నల లో కుంభకోణం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కష్టపడి పండించిన పంటకు కోత విధించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
1,700 రైతుల వద్ద 45 వేల క్వింటాళ్ల జొన్నల కొనుగోలు..
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం మద్దతు ధరకు 17వందల రైతుల నుండి 45వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 45వేల క్వింటాళ్ల జొన్నలలో దాదాపుగా 600 పైగా క్వింటాళ్ల జొన్నలు మాయమైనట్లు ప్రచారం జరుగుతుంది.
20వేలు తక్కువ వచ్చాయి..
రబీ సీజన్ లో సాగు చేసిన జొన్న పంటను మద్దతు ధరకు 30 క్వింటాళ్లు అమ్ముకున్నాను. 30 క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధరగా రూపాయలు. 1,10,970 రావాల్సి ఉంది. మూడు రోజుల క్రితం తన బ్యాంక్ ఖాతాలో 9,0625 జొన్నల డబ్బులు పడ్డాయి. మరో 20, 345 రూపాయలు తక్కువ వచ్చాయి.
ఈ విషయంపై పిఎసిఎస్ అధికారులను అడుగుతే బ్యాంకులో తిరిగి జమ అవుతాయని అంటూ బ్యాంకు చుట్టూ తింపుతున్నారని ఆవేదనతో తెలిపారు. ఇప్పటికైనా కష్టపడి పండించిన పంటకు రావలసిన డబ్బులు ఇప్పించండి అంటూ కోరుతున్నారు.
కేంద్రే గణేష్, రైతు, ఇంద్రవెల్లి
11 వేల రూపాయలు కోత విధించారు..
కష్టపడి పండించిన జొన్న పంటను మార్కెట్ లో మద్దతు ధర కు అమ్ముతే తనకు రావలసిన డబ్బుల్లో రూ. 11,097 కోత విధించారు. తనకు 31,441 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఇలా తక్కువ డబ్బులు వచ్చిన రైతులు చాలా మంది రైతులు ఉన్నారని రైతు వాపోయారు.
- తగిరే పాండు, రైతు, ఏమైకుంట
తక్కువ డబ్బులు వచ్చిన రైతులకు తిరిగి వస్తాయి..
మద్దతు ధరకు కొనుగోలు చేసిన జొన్న పంటలలో తక్కువ డబ్బులు వచ్చిన రైతులకు తిరిగి డబ్బులు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడి నుండి గోదాముకు సరుకు పంపించే సమయంలో లోడు తక్కువ ఎక్కువ కావడంతో రైతులకు సరియైన డబ్బులు రాలేదని, డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ధరం సింగ్, కార్యనిర్వాహక అధికారి, పిఎసిఎస్ ఇంద్రవెల్లి