డాక్టర్ పాట 100 కోట్లు

23-09-2026 | 05:25am

అక్రమంగా సంపాదించిన నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ 

లక్ష్మీభాస్కర్.. అరెస్టు చేసిన ఏసీబీ.. 13 చోట్ల సోదాలు

విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు, విలువైన స్థలాల గుర్తింపు

ప్రభుత్వ లెక్కల్లో రూ.6.13 కోట్లు.. 

బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా తేలిన ఆస్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్(NIMS Deputy Superintendent) డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌ను(Nori Lakshmi Bhaskar) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు(ACB officials) మంగళవారం అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని మొత్తం 13 ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు(Disproportionate assets) బయటపడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం స్వాధీ నం చేసుకున్న పత్రాల విలువ రూ.6.13 కోట్లుగా పేర్కొనగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. 

గుర్తించిన ఆస్తుల వివరాలు..

కూకట్‌పల్లిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు, మణికొండ, పేట్ బషీరాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో మరో 5 ఫ్లాట్లు, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. ఏపీలోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఖరీదైన స్థలం ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీసు డిపాజిట్లలో రూ.12 లక్షలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులు గుర్తించారు.

జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ సహా 3 లగ్జరీ కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ సహా 4 ద్విచక్ర వాహనాలు, 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వివాదాస్పద ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్ల పెట్టుబడి, సన్నిహితులకు రూ.1.33 కోట్లు చేతి రుణాలుగా ఇచ్చినట్లు గుర్తించారు. గత 20 ఏళ్లుగా నిమ్స్‌లో సేవలందిస్తూ, ఐదేళ్లుగా డిప్యూటీ అడిషనల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మీభాస్కర్‌పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సోదాలు ముగిసిన అనంతరం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు  మరిన్ని అదనపు ఆస్తులపై వెరిఫికేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు