విద్యుత్ వ్యవస్థపై ప్రభుత్వం ఫెయిల్
- 4 వేలకు 400 మెగావాట్లే ఉత్పత్తి
- యాదాద్రి ప్లాంట్ బొగ్గు వాడకంలో నాణ్యతాలోపం
- బేసిన్‌కు సంబంధంలేని కుప్పంకు శ్రీశైలం నీళ్లు తరలింపు
- మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విద్యుత్ వ్యవస్థ నిర్వహణ(Power System Management)లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీమంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) పూర్తి సామర్ధ్యం 4 వేల మెగావాట్లకు 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. బేసిన్ కాని బేసిన్‌కు చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నారని, బేసిన్లోనే ఉన్న ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నీళ్లు తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సొంత జిల్లా పంటలను ఎండబెడుతున్నారని విమర్శించారు.
మంగళవారం తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ విజన్‌తో దేశంలో ఎక్కడా లేనివిధంగా యాదాద్రి అల్ట్రా మెగా ధర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించారన్నారు. యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలని, కానీ జీ13, జీ14 క్వాలిటీ కోల్ వాడుతున్నారని పేర్కొన్నారు. బొగ్గు వాడకంలో నాణ్యతా లోపం ఉందన్నారు. కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిందన్నారు.
40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే ఈ రోజు బొగ్గు కొరత ఎందుకు ఏర్పడుతుందన్నారు. ఈ నిల్వలు ఎక్కడ అని ప్రశ్నించేందుకు తాను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీ ద్వారా ఇస్తామని చెప్పారని, తాము తొలివిడతగా ఎన్టీపీసీ 800 మెగావాట్ల కేంద్రాన్ని స్థాపించేలా చర్యలు తీసుకుని విద్యుత్ తీసుకున్నామన్నారు.
మన దగ్గర తయారయ్యే సింగరేణి ఉత్పత్తి విద్యుత్ వద్దు అని రాజస్తాన్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకున్నారని, రాజస్తాన్‌కు కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రైతుల పంటలు ఎండబెట్టి ఉసురుబోసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తిలో 3వ వంతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రైతులకు 7 నుంచి 8 గంటలు కరెంటు ఇవ్వడం లేదని, థర్మల్ పవర్ స్టేషన్లో 45 రోజులు బొగ్గు నిల్వలు ఉండాలన్నారు.
శ్రీశైలం నీళ్లు కుప్పంకు..
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్లు కష్ణానది నీళ్లు బేసిన్‌కు సంబంధం లేని కుప్పంకు తీసుకువెళ్తున్నారని వెల్లడించారు. బేసిన్లోనే ఉన్న ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి నీళ్లు తీసుకెళ్లడం లేదని, సీఎం చేతకానితనాన్ని ఎల్ నినో మీద పెడుతున్నారని విమర్శించారు. సీఎం సొంత జిల్లాలోనే పంటలను ఎండబెడుతున్నారని అన్నారు. ఏపీలో రైతుల కేరింతలు.. తెలంగాణలో రైతుల ఆక్రందనలు వినిపిస్తున్నాయన్నారు. గులాబీ చొక్కాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని పొంగులేటి అన్నారని, ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే మంత్రులు కర్ణాటకకు వెళ్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.