శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ
మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ ఘట్టం నిర్వహణ
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 15: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి(Tirumala Sri Venkateswara Swamy) వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బంగారు ధ్వజ స్తంభంపై గరుడ పటాన్ని అర్చకులు ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మీన లగ్నంలో శ్రీవారి ధ్వజారోహణ ఘట్టాన్ని మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు.
సకల దేవతలు.. అష్ఠదిక్పాలకులను బ్రహోత్మవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం బంగారు తిరుచ్చిపై స్వామి, పరివార దేవతలతో నాలుగ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు కొనసాగింది. శ్రీవారి బ్రహోత్మవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుమల గిరులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగింది. బ్రహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu) రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ముఖ్యమంత్రి వెంట ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రహ్మణి ఉన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి, ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు.అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సందర్భంగా ఆలయంలో కనిపించారు. కాగా సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు భకులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. ఈ నెల 23 వరకు బ్రహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.