ఉద్యోగులకు రాహుల్ భరోసా
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకంపై రాహుల్ గాంధీ ఫైర్.. మోదీ సర్కారుకు ప్రశ్నల వర్షం!
రూ.9 వేల కోట్ల లాభం తెచ్చిన బ్యాంకును అమ్మేస్తారా? రాహుల్ సంచలన ప్రశ్న!
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. లాభాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు విక్రయించాలనుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులకు తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చేసిన Post ద్వారా కేంద్ర ప్రభుత్వ Disinvestment విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల ఏర్పాటు జరిగితే.. మోదీ ప్రభుత్వ పాలనలో ఉన్న బ్యాంకులను విక్రయిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. గత ఏడాది మార్చిలో పార్లమెంట్ హౌస్‌లో ఐడీబీఐ ఉద్యోగుల బృందం తనను కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. బ్యాంకును లాభాల బాట పట్టించేందుకు తాము కష్టపడితే, ఇప్పుడు దానిని ఎందుకు అమ్ముతున్నారని వారు తనను ప్రశ్నించినట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని తాను లోక్‌సభలో కూడా ప్రస్తావించి, విక్రయానికి గల కారణాలతో పాటు ఉద్యోగులు, డిపాజిటర్ల ప్రయోజనాలకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ గతంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఉద్యోగుల కృషితో తిరిగి లాభాల బాట పట్టిందని రాహుల్ పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న ఈ సంస్థ గత ఏడాది రూ.9,000 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిందని చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఉద్యోగుల శ్రమేనని ప్రశంసించారు. ఇంతటి ఆర్థిక పురోగతి సాధించిన సంస్థను విక్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కలిపి ప్రస్తుతం బ్యాంకులో 95 శాతం వాటాను కలిగి ఉన్నాయని, ప్రతిపాదిత విక్రయం తర్వాత ఈ వాటా 34 శాతానికి తగ్గుతుందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. 2003లో పార్లమెంట్‌కు ఇచ్చిన హామీ ప్రకారం ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటాను కొనసాగించాల్సి ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్‌కు ఇచ్చిన మాట దేశ ప్రజలకు ఇచ్చిన మాటతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ జరిగితే బ్యాంకులో Scheduled Castes (SC), Scheduled Tribes (ST), Other Backward Classes (OBC) అభ్యర్థులకు అమలవుతున్న Reservation విధానంపై ప్రభావం పడుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల Service Conditionsకు ఇప్పటివరకు ఉన్న రక్షణ కూడా బలహీనపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఐడీబీఐ విక్రయాన్ని కెనడాకు చెందిన Fairfax సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం ఆర్థిక సంస్థలు మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వ్యవస్థలని రాహుల్ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంతో పాటు Public Sector కూడా బలంగా ఉండాలని కాంగ్రెస్ విశ్వసిస్తుందని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ఐక్యంగా ఉండాలని ఐడీబీఐ సిబ్బందికి పిలుపునిచ్చారు.