సెయింట్ జోసెఫ్ పాఠశాలను సీజ్ చేయాలి
నిబంధనలు ఉల్లంఘించి ప్రత్యేక తరగతులు నిర్వహణ
డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి
మునుగోడు,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సెయింట్ జోసెఫ్ పాఠశాల(Saint Joseph's School)పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI Assistant Secretary Katta Lingaswamy) డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పాఠశాల ఎదుట డీవైఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తరగతులను బహిష్కరించి మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం 12 రోజుల పాటు సెలవులు ప్రకటించినప్పటికీ, పాఠశాల యాజమాన్యం నిబంధనలను పట్టించుకోకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.
పాఠశాల భవనంలో కాకుండా అనుమతులు లేని ఉపాధ్యాయుల వసతి గృహం(Teachers' Hostel)లో తరగతులు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్ పేరుతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ, ప్రత్యేక తరగతుల పేరిట అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం తగదని పేర్కొన్నారు.
గతంలోనూ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.అనుమతులు లేని భవనంలో తరగతులు నిర్వహించడంపై సమగ్ర విచారణ జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ టి. మల్లేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించి పాఠశాలను మూసివేయించారు.
ఈ నెల 22 వరకు పాఠశాలకు పూర్తిస్థాయిలో సెలవులు ఉంటాయని, 23వ తేదీ నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు కుక్కల మహేష్, ఇరుగుదిండ్ల గణేష్, పగిళ్ల సాయి తేజ, చేకూరి రామ్ చరణ్, పగిళ్ల రామ్ చరణ్ ఉన్నారు.