5 September, 2026 | 1:18 PM

నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న మమ్మల్ని పందికొక్కులుగా ప్రస్తావిస్తారా..!

05-09-2026 | 12:04pm

వరద నీటిలో కొట్టుకుపోయిన వడ్లను కూడా 

బలవంతంగా బెదిరించి మిల్లులకు కేటాయించారు

ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేస్తే ఎలా

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి హెచ్చరికలు 

నాగర్‌కర్నూల్‌ (విజయక్రాంతి): మారుమూల పల్లెల్లోనూ రైస్‌ మిల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, అలాంటి మమ్మల్ని పందికొక్కులుగా ప్రస్తావిస్తారా అంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్‌ యార్డ్‌ పరిసరాల్లోని ఓ ప్రైవేటు మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

2024-25 ఏట వరదల్లో కొట్టుకుపోయిన వడ్లను కూడా తెచ్చి, మిల్లుల్లో స్థలం లేకపోయినా అధికారులు పోలీసులతో బెదిరించి బలవంతంగా మిల్లులకు కోటా కేటాయించారని, అలాంటి ధాన్యాన్ని ఆడించి ప్రభుత్వానికి అప్పగిస్తున్నామన్నారు. ఇందులో కొంతమేర పందికొక్కులు నాశనం చేస్తే, మిల్లర్స్‌లను పందికొక్కులుగా ప్రస్తావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్లు ఖర్చుపెట్టి రైస్‌ మిల్లు ఏర్పాటు చేసి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి యువతకు ఉపాధి కల్పిస్తున్న రైస్‌ మిల్లులను ప్రోత్సహించాల్సింది పోయి దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఫారిన్‌ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని మాత్రం రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతిస్తున్నారని ఆరోపించారు.

రైస్‌ మిల్స్‌ ఇండస్ట్రీని నాశనం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. బయట సమాజంలో రైస్‌ మిల్లర్స్‌ అంటేనే తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులను ఆపకపోతే రైస్‌ మిల్లులకు తాళాలు వేసి జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

వారితోపాటు సెక్రటరీ రవి కుమార్‌, రా రైస్‌ మిల్‌ ప్రెసిడెంట్‌ ఆకుతోట నవీన్‌ కుమార్‌, ఎక్స్‌ ప్రెసిడెంట్‌ హకీమ్‌ రాజేష్‌, కల్వకుర్తి ప్రెసిడెంట్‌ బాలకృష్ణ, వేణుగోపాల్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు