5 September, 2026 | 2:11 PM

కల్వకుర్తిలో "నయా దందా"

05-09-2026 | 01:01pm

రంగారెడ్డి, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): పెద్ద పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలను నడిరోడ్డుపై తూట్లు పొడుస్తున్నా పట్టించుకోని కొందరు, సొంతంగా ట్యూషన్లు (Tuitions) చెప్పుకుంటూ పొట్టకూటి కోసం తాపత్రయపడే సామాన్య నిరుద్యోగ ఉపాధ్యాయుల(Unemployed teachers)పై పడ్డారు. విద్యార్థి సంఘాల(Student unions) ముసుగులో, విలేకరులమని చెప్పుకుంటూ చేస్తున్న ఈ "అక్రమ వసూళ్ల దందా" కల్వకుర్తి పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇంట్లో ట్యూషన్‌ చెబితే నేరమా..?

గత 20 ఏళ్లుగా కల్వకుర్తిలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ఒక నిరుద్యోగ ఉపాధ్యాయుడిని ఇటీవల కొందరు టార్గెట్‌ చేశారు. ఇంట్లో ట్యూషన్లు, కోచింగ్‌ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నావంటూ బెదిరింపులకు దిగారు. తాను కల్వకుర్తి విలేకరి ఇన్‌చార్జినని చెప్పుకున్న ఒక వ్యక్తి, విద్యార్థి సంఘాల నాయకులను సదరు ఉపాధ్యాయుడి ఇంటి వద్దకు పంపించి హంగామా సృష్టించాడు. అంతటితో ఆగక, ఒక అధికారిని కూడా అక్కడికి పంపించి భయాందోళనకు గురిచేశారు.

రూ. 40 వేలు వసూలు... వేధింపుల పర్వం

బెదిరించినంత పని చేసి, ఆ తర్వాత "నేనంతా సర్దుబాటు చేస్తా" అని నమ్మబలికి సదరు ఉపాధ్యాయుడి నుంచి విడతల వారీగా దాదాపు రూ. 40 వేలకు పైగా గుంజారు. కొంత నగదు చేతికి తీసుకోవడమే కాకుండా, మిగతా మొత్తాన్ని వేరే ఆన్‌లైన్‌ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. కష్టపడి సంపాదించే సొమ్మును ఇలా అక్రమంగా దోచేస్తుండటంతో సదరు ఉపాధ్యాయుడు తీవ్ర మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

స్థానికుల ఆగ్రహం

కార్పొరేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులను వదిలి... సామాన్యులపై ప్రతాపమా?... సదరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు గాలికి వదిలేసిన పెద్ద పెద్ద ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల వైపు కనీసం కన్నెత్తి చూడని వీరు, సొంతంగా బతుకుదెరువు వెతుక్కుంటున్న నిరుద్యోగ ఉపాధ్యాయులపై పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏమైనా సమస్యలు ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటే తాము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవస్థ పట్ల పెరిగిన అసహ్యం

సమాజంలో సమస్యలను వెలుగులోకి తెచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన మీడియా, విద్యార్థుల సమస్యల కోసం పోరాడాల్సిన విద్యార్థి సంఘాలు... ఇలా అక్రమ వసూళ్లకు దిగడం సమాజానికే శాపంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, విలేకరుల పేరు చెప్పుకుని ఇటువంటి బ్లాక్‌మెయిలింగ్‌ దందాలకు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.



మరిన్ని వార్తలు