5 September, 2026 | 2:18 PM

ఆదివాసిని కొట్టిన అధికారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి!

05-09-2026 | 01:12pm

కన్నెపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఆదివాసులపై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం(Erma Punnam) ఆరోపించారు. కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో ఆదివాసీ ఆత్రం బాపు(Athram Bapu)ను ఈ నెల 3న ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ కొట్టడాన్ని ఆదివాసులు తీవ్రంగా ఖండించారు. ఆత్రం బాపును పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిక్కుడు మొక్కలకు సపోర్టుగా కొన్ని కర్రలు కావాలని అడవిలోకి వెళ్లి వాటిని సేకరిస్తున్న క్రమంలో అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ ఆత్రం బాపుపై విరుచుకుపడి విచక్షణారహితంగా కొట్టారని, "నన్ను కొట్టకండి, నేను దండం పెడతాను, నన్ను క్షమించండి సార్‌" అని ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆత్రం బాపును, తనతో వచ్చిన ఆయన బామ్మర్ది తుమ్ముడి అర్జయ్యను కూడా కొట్టి రూ.5,000 డిమాండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాజశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖర్‌ ఇక్కడికి బీట్‌ ఆఫీసర్‌గా వచ్చిన నాటి నుంచి ప్రజలపై ఏ కారణం లేకుండా విరుచుకుపడి కొడుతున్నారని మండిపడ్డారు. మేకలు మేపడానికి వెళ్లిన మేకల కాపరినీ కొట్టారన్నారు. ఈ జిల్లాలో ఇంధనపల్లి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగిందని, ప్రతినిత్యం ఆదివాసులపై ఎక్కడో ఒకచోట దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అందులో కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని మండిపడ్డారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకొని ఆత్రం బాపును, ఆయన బామ్మర్దిని కొట్టిన అటవీ బీట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మర్మల మల్లేశ్వరి, శంకర్‌, మధుగం రమేష్‌, పెద్దల నాని, దిగిడ చంద్రయ్య, చింతపూడి లచ్చన్న, రెడ్డి బక్కయ్య, కేర్కరి శంకర్‌, రెడ్డి లక్ష్మీ, సీలేపల్లి సమ్మక్క, సీలేపల్లి శ్రీకాంత్‌, అన్నం రమేష్‌, భాగాల దసరక్క, నేర్పల్లి కన్నయ్య, మానేపల్లి వెంకటేష్‌, చింతపూడి భీమయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు