5 September, 2026 | 3:19 PM

కోమటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు బోల్తా

05-09-2026 | 02:06pm

నిలిచిన లారీని ఢీకొన్న దానిమ్మ లారీ

డ్రైవర్ పరిస్థితి విషమం

రామాయంపేట సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): రహదారిపై క్షణకాలం నిర్లక్ష్యం.. ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌(Nanded)కు దానిమ్మ పండ్ల లోడుతో వెళ్తున్న లారీ.. మార్గమధ్యంలోని కోమటిపల్లి(Komatipalli) వద్ద ఆగి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు అదుపుతప్పి బోల్తాపడ్డాయి.

ఢీకొన్న ఘటనలో దానిమ్మ లారీ డ్రైవర్ బంటి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి తరలించారు.

ప్రమాదం ధాటికి లారీలకు భారీగా నష్టం వాటిల్లగా.. రహదారిపై దానిమ్మ పండ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్కసారిగా చోటుచేసుకున్న ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

 ప్రమాదంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, వేగంగా దూసుకెళ్లే భారీ లారీలు.. క్షణం ఆలస్యం ప్రాణాల మీదకు తెస్తున్న పరిస్థితులు కోమటిపల్లి ప్రమాదంతో మరోసారి స్పష్టమయ్యాయి.

మరిన్ని వార్తలు