అశోక విజయదశమి సందర్భంగా బౌద్ధ ఆచారంలో కర్ణవేదనము

23-10-2026 | 07:08pm
  1. కులమతాలకు అతీతంగా బుద్ధుని పంచశీల, అష్టాంగ మార్గాలను అనుసరించాలి
  2. 300 మందికి పైగా హాజరు..
  3. బుద్ధవందనంతో చిన్నారి జోత్స్నశ్రీకి ఆశీర్వాదాలు

వెంకటాపురం నూగూరు అక్టోబర్ విజయ క్రాంతి: అశోక విజయదశమిని(Ashoka Vijayadashami) పురస్కరించుకుని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు(Samata Sainik Dal Telangana State Leaders), సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయాల చైర్మన్ డా, దుర్గం నగేష్ - ప్రమీల దంపతుల కుమార్తె జోత్స్నశ్రీ కర్ణవేదనము వేడుకను ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పల గూడెం గ్రామంలో  బౌద్ధ ఆచార సంప్రదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ధర్మ అనుయాయులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు సహా 300 మందికి పైగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బంతేజీ భరద్వాజ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు రత్నం బాబురావు, మొవల్కర్ ప్రేమ్‌కుమార్ పాల్గొని భగవాన్ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం చిన్నారి జోత్స్నశ్రీ కుటుంబ సభ్యులు, అతిథులు, ప్రజలతో కలిసి బుద్ధవందనం నిర్వహించారు. బౌద్ధ సంప్రదాయంలో చిన్నారి మేనమామలు చిలుముల ప్రశాంత్, రామటంకి నవీన్ చేతుల మీదుగా కర్ణవేదనము వేడుక జరిపించారు.

బుద్ధుని మార్గమే మానవాళికి శరణ్యం

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుల, మత, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భగవాన్ బుద్ధుడు బోధించిన పంచశీల, అష్టాంగ మార్గాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ విలువలు మనిషిలో నైతికత, సమానత్వం, కరుణ, సోదరభావాన్ని పెంపొందించి సమాజంలో శాంతియుత జీవనానికి దోహదపడతాయని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు మానవాళికి మార్గదర్శకమని,

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన బౌద్ధ ధర్మ మార్గంలో నడుస్తూ వివక్షలేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి హాజరైన హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ మానవ సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సోదరభావానికి బుద్ధుని బోధనలు ఎంతో ప్రాధాన్యమున్నవని పేర్కొన్నారు. వివిధ మతాలు, సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఒకే వేదికపై పాల్గొనడం కార్యక్రమంలో ప్రత్యేకతగా నిలిచింది.

కుటుంబ వేడుకను బౌద్ధ ధర్మ సంప్రదాయంలో నిర్వహించడం ద్వారా సామాజిక సమానత్వం, మానవీయ విలువల పట్ల తమ నిబద్ధతను చాటామని నిర్వాహకులు తెలిపారు. డా,దుర్గం నగేష్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, గురువులు, బంధువులు, శ్రేయోభిలాషులు చిన్నారి జోత్స్నశ్రీని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు