గ్లామర్ పేరుతో వాడుకుంటారు!

19-09-2026 | 05:50am

సినీ పరిశ్రమ(Film industry)లో కథానాయికల(Heroines) పట్ల ఉన్న వివక్షను, గ్లామర్(Glamour) ముసుగులో జరిగే దోపిడీని నిలదీయడంలో బాలీవుడ్ భామ రాధికా ఆప్టే(Radhika Apte) ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ చిత్రాల్లో రొమాన్స్, మహిళల పాత్రలను ప్రదర్శించే తీరుపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా(Social Media)లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు శకున్ బాత్రా(Shakun Batra)తో కలిసి పాల్గొన్న రాధికా ఆప్టే, చిత్ర పరిశ్రమలోని ద్వంద్వ ప్రమాణాలను గట్టిగా ఎండగట్టింది. గ్లామర్ పేరుతో వాడుకోవడం గురించి చెప్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది రాధికా ఆప్టే.

“భారతీయ చిత్ర పరిశ్రమలో నటీమణులను ఒకవైపు ‘దేవత’ల్లా కొలుస్తూనే, మరోవైపు కేవలం గ్లామర్ పేరుతో కమర్షియల్‌గా వాడుకుంటున్నారు. నేను షారుఖ్ ఖాన్ సినిమాలకు వీరాభిమానిని. చిన్నతనంలో నేను ఎంతో ఆస్వాదించిన ఆయన పాత చిత్రాలను ఇప్పుడు తిరిగి చూసినప్పుడు కొన్ని దృశ్యాలు నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ముఖ్యంగా ఒక మహిళ వద్దు అని స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆమె అభ్యంతరాన్ని పట్టించుకోకుండా బలవంతంగా వెంటపడటాన్ని ప్రేమగా చూపించేవారు. టీనేజ్‌లో ఇలాంటి వాటినే గొప్ప కలలుగా కనేవాళ్లం.

కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది ఎంత భయానకంగా అనిపిస్తుందో! అప్పట్లో తెరపై మహిళలను చిత్రించిన విధానంలోనే అసలైన లోపం ఉంది. ఒకవైపు మహిళలను కేవలం గ్లామర్ కోణంలో వాడుకుంటూనే.. మరోవైపు వారిని మంచి చెడుల పరిధిలో బంధించడం సరికాదు. ఒకవైపు వారిపై జోకులు వేస్తూ, మరోవైపు వారిని ‘దేవి’లా కొలుస్తూ పీఠంపై కూర్చోబెట్టడం నాకు అస్సలు నచ్చలేదు” అని తెలిపింది. ఇంకా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న రాధికా ఆప్టే.. “కేవలం కొన్ని కిలోల బరువు పెరిగిందని ఒక పెద్ద సినిమా నుంచి నన్ను తొలగించారు.

ఆ సమయంలో మానసిక ఒత్తిడికి లోనై థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. పాత్రలకు సరిపోవాలంటూ ముక్కు, రొమ్ము సర్జరీలు చేయించుకోవాలని, శరీర భాగాలకు ప్యాడింగ్స్ వాడాలని కొందరు సలహా ఇచ్చారు. ఈ తరహా వికృత సౌందర్య ప్రమాణాలను నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను” అని తెలిపిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఓటీటీ వేదికలపై వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న రాధికా ఆప్టే, గ్లామర్ డాల్‌గా మాత్రమే హీరోయిన్లను పరిమితం చేసే ధోరణి మారాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 

మరిన్ని వార్తలు