అక్రమ నీటి దందా..!

23-10-2026 | 07:22pm

వాల్టా చట్టానికి తూట్లు!

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లతో వాణిజ్య వ్యాపారం?

రోజుకు వందలకు పైగా ట్యాంకర్ల నీటి విక్రయాలు.. ఒక్కో ట్యాంకర్‌కు అధిక ధరల వసూళ్లు!

అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు.. ఉన్నతాధికారులు స్పందించాలి

మేడిపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి); బోడుప్పల్‌ సర్కిల్(Boduppal Circle) పరిధిలో నీటి అవసరాలను(Water requirements) ఆసరాగా చేసుకుని కొందరు అక్రమంగా నీటి వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ(Agriculture) అవసరాల కోసం తీసుకున్న విద్యుత్‌ కనెక్షన్లను వినియోగిస్తూ, ఎలాంటి అనుమతు లు లేకుండా జలాలను  వెలికి తీసి, ఏదేచ్ఛగా ట్యాంకర్ల(Tankers) ద్వారా విక్రయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానికుల సమాచారం ప్రకారం ... ఆయా ప్రాంతాలలో రోజుకు సుమారు వందలకు పైగా ట్యాంకర్ల(Tankers) వరకు నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ట్యాంకర్ కు అధిక ధరలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయల విలువైన నేటి వ్యాపారం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తం అవుతున్నాయి.

వ్యవసాయ కనెక్షన్లతో వాణిజ్య దందా?

వ్యవసాయ అవసరాల కోసం మంజూరైన విద్యుత్‌ కనెక్షన్లను(Electrical connections) వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి ఉద్దేశించి విద్యుత్ సదుపాయాన్ని ఉపయోగించి నీటిని వెలికి తీసి ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తుంటే, ఆ విద్యుత్ వినియోగం నిబంధనలకు అనుగుణంగా ఉందా?  విద్యుత్ కనెక్షన్లు ఏ ప్రయోజనం కోసం మంజూరయ్యాయి ప్రస్తుతం వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే అంశాలపై విద్యుత్ శాఖ అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వ్యవసాయ బోర్ల నుంచి భారీగా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లయితే, ఆ విద్యుత్‌ కనెక్షన్ల వినియోగం నిబంధనలకు అనుగుణంగా ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

వాల్టా చట్టం అమలుపై ప్రశ్నలు

భూగర్భ జలాల పరిరక్షణకు ఉద్దేశించిన వాల్టా చట్టం (WALTA) నిబంధనల అమలుపై కూడా స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అనుమతులు లేకుండా భూగర్భ జలాలను తోడటం, వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయా? అనే కోణంలో సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంది. భూగర్భ జలాల వినియోగం, బోర్ల నిర్వహణ, నీటి సరఫరాకు సంబంధించిన అనుమతులను తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోజుకు వందలకు పైగా ట్యాంకర్ల రాకపోకలు?

రోజుకు వందలకుకు పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ట్యాంకర్‌కు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో నీటి వనరుల యజమానులు, ట్యాంకర్ల నిర్వాహకులు, సరఫరా వ్యవస్థపై సమగ్ర విచారణ జరగాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ట్యాంకర్ల సంఖ్య, విక్రయ ధరలు, అనుమతుల స్థితిపై అధికారిక ధ్రువీకరణ అవసరం ఉంది.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

ఇంత పెద్ద స్థాయిలో నీటి వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారా? అక్రమాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయా? అందితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో లోపాలున్నాయా లేదా అన్నది విచారణ ద్వారా తేలాల్సి ఉంది. విద్యుత్‌ శాఖ, భూగర్భ జలాల శాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల వినియోగం, భూగర్భ జలాల తోడకం, నీటి విక్రయాలకు సంబంధించిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో భూగర్భ జలాల కొరత ఏర్పడకుండా నీటి వనరుల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని  ప్రజలు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు