గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవర్ అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం

19-09-2026 | 05:02pm

పాల్వంచకు, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష

పాల్వంచ, (విజయక్రాంతి): గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అచీవర్ అబ్దుల్ నుమాన్ను జమాత్-ఇ-ఇస్లామీ హింద్ (JIH)( Jamaat-e-Islami Hind) ఉమెన్స్ వింగ్ పాల్వంచ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నుమాన్‌కు పూలదండలు, శాలువాలతో సత్కరించి అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ షహనాజ్, జిల్లా రూరల్ ప్రెసిడెంట్ సఫుర సుమయ్య, JIH పాల్వంచ యూనిట్ ప్రెసిడెంట్ ఫహిమీద బేగం, JIH పాల్వంచ ఖాతూన్ నజ్మా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. JIH పాల్వంచ యూనిట్ సభ్యులు పర్వీన్, నస్రిన్, సమీనా, రాబియాతో పాటు అబ్దుల్ నుమాన్ తల్లి ఆయేషా ఫిర్దోస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే అబ్దుల్ నుమాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం పాల్వంచ ప్రజలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో, రాష్ట్ర స్థాయిలో బాక్సింగ్‌లో ప్రతిభను కనబరుస్తూ విజయాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అబ్దుల్ నుమాన్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి, పాల్వంచతో పాటు తెలంగాణ రాష్ట్రానికి దేశ, విదేశాల్లో మరింత మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు