గణపయ్య ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
కుంకుమార్చనలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు..
రామాయంపేట, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమం(Kumkumkarchana program) ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు మాట్లాడుతూ.. ఆ గణపయ్య ఆశీస్సులతో రామాయంపేట పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంపై విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ లావణ్య నాగరాజును ఆర్యవైశ్య సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తనను ఆహ్వానించి సత్కరించినందుకు ఆమె సంఘం సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.