గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)(Telangana State United Teachers' Federation) రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతి కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఎంజేపీ, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకుల పాఠశాలలను సందర్శించి వారితో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని,
ముఖ్యంగా గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులు అడ్మిషన్లు చేయాలనే ఒత్తిడి తగ్గించాలని, అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయులకు డిఏలు, పిఆర్సి వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతేకాకుండా గురుకులాల్లో, కేజీబీవీలు, మోడల్ స్కూల్ లలో కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని, ప్రతి గురుకులానికి ఇద్దరూ హెల్త్ ఆఫీసర్లను నియమించాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రాజావేణు, మండల ప్రధాన కార్యదర్శి ఎం. బారిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.