సరిహద్దుల్లో పోలీసుల వేట

03-10-2026 | 05:25pm
  1. అక్రమ రవాణాపై కొరడా.. 8 కీలక ప్రాంతాల్లో నిఘా ముమ్మరం
  2. కోటపల్లి బార్డర్‌లో పోలీసుల నాకాబందీ..!

కోటపల్లి, అక్టోబర్ 3 ( విజయక్రాంతి ) : అక్రమ రవాణాకు(Smuggling) అడ్డుకట్ట వేసేందుకు జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు(Jaipur Sub-division Police) సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో 8 కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించి ముమ్మర నాకాబందీ, వాహన తనిఖీలు(Vehicle inspections) చేపట్టారు. కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని చింత వద్ద ఎన్‌హెచ్-63పై భారీ నాకాబందీ ఏర్పాటు చేసి రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనదారులు, ప్రయాణికుల వివరాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలించే వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం, గంజాయి, మద్యం, ఇసుక తదితర రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతున్నాయని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు