కవ్వాల్ టైగర్ జోన్ రద్దుకై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రాథోడ్ రితీష్
జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ టైగర్ జోన్(Kawal Tiger Zone) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలు ఆదివారంతో 43వ రోజుకు చేరుకున్నాయి. బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితీష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రజలకు తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైగర్ జోన్ వల్ల స్థానిక ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ రద్దు డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. టైగర్ జోన్ నిబంధనల వల్ల ఏజెన్సీ, అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలకు ఈ జోన్ అడ్డంకిగా మారిందని విమర్శించారు. బాధితుల పక్షాన నిలబడి టైగర్ జోన్ రద్దయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని రితీష్ స్పష్టం చేశారు.