సాగునీటి సమస్యపై స్పందించి న్యాయం చేయాలి

06-10-2026 | 09:58am

మహబూబ్‌నగర్ జిల్లా,- గండీడ్,అక్టోబర్ 5 విజయక్రాంతి: సాగునీరు (Irrigation Water) అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, సుమారు 300 ఎకరాల పంటలను కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గండీడ్ మండలానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో (Praja Vani) అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సల్కర్‌పేట్, రంగారెడ్డిపల్లి, లింగయపల్లి గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ రాజగోపాల్, ఎంపీడీవో మంజులకు తమ సమస్యలను వివరించారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

సాలార్‌నగర్ ప్రాజెక్టు (Project) పరిధిలోని నీటిని పంపుమోటార్ల ద్వారా తోడుకోవడంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. బోర్ మోటార్ల ద్వారా నీటిని తోడుకోవడాన్ని నిలిపివేసి, ప్రాజెక్టు నుంచి కాలువల (Canals) ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని కోరారు.

రంగారెడ్డిపల్లి పెద్దవాగుపై ఆధారపడి మూడు గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వాగు ద్వారా నీరు అందకపోవడంతో సుమారు 300 ఎకరాల్లో పంటలు (Crops) దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తమ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని రైతులు తెలిపారు.

పంటలు చేతికొచ్చే దశలో సాగునీరు అందక నష్టపోవాల్సి వస్తోందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను ప్రభుత్వం (Government) సానుకూలంగా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ. జితేందర్‌రెడ్డి, ఉషన్న, లింగమయ్యతో పాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు