కీలక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కూసుమంచి, అక్టోబర్ 28(విజయక్రాంతి): ఖమ్మం మమత వైద్య విద్యా కళాశాల(Mamata Medical College, Khammam) నందు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు(Graduate Voter Registration) కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) మాట్లాడుతూ డాక్టర్స్ అందరు బాధ్యతాయుతంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వం మారుతుందా లేదా అనేది కాకపోయినా పట్టభద్రులు తమ అభిప్రాయాలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమ మనసులోని మాటలను ఈ ఓటు ద్వారా వ్యక్తపరిచే మంచి అవకాశమని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా ఆనాడు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని, ఆ సమయంలో వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, మరియు ఆనాడు ప్రభుత్వం అందించిన సేవలు ఎంతో మంది ప్రాణాలను కాపాడాయని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల సమయంలో ఓటర్లు, పట్టభద్రులు తమ కుటుంబసభ్యులలో ఎవరైనా అర్హత ఉండి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడులను గమనించి విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్ రాజ్, ప్రిన్సిపాల్ అనురాధ, సూపరింటెండెంట్ రామస్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.