ఆర్కే విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

10-10-2026 | 08:43pm

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల(RK Group of Educational Institutions) (ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు) ఆధ్వర్యంలో శనివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకొని బతుకమ్మ వేడుకల(Bathukamma Celebrations)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే ఈ గొప్ప పండుగను విద్యార్థినులు, మహిళా అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.

ఆయా కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను అత్యంత సృజనాత్మకంగా పేర్చారు. కొన్ని బతుకమ్మలను అమ్మవారి రూపంలో, మరికొన్నింటిని చంద్రవంక ఆకృతిలో తీర్చిదిద్ది తమ సృజనాత్మకతను చాటుకున్నారు. వేడుకల్లో భాగంగా ఎస్ఆర్కే కళాశాల విద్యార్థినులు ఆర్కే కళాశాలకు విచ్చేసి సంయుక్తంగా బతుకమ్మ ఆడారు. అనంతరం అక్కడి నుండి విఆర్కే కళాశాల మీదుగా ఆర్యానగర్ కాలనీ పార్కుకు చేరుకొని, స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ దత్తాద్రి, నవీన్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మల నిమజ్జన కార్యక్రమానికి ఆర్యానగర్ కాలనీ కౌన్సిలర్ సుజిత భరత్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు.

ఈ సందర్భంగా ఆర్కే గ్రూప్ సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్కే విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ అని, ప్రకృతిని పూజించాలే తప్ప దానికి ఎలాంటి హాని తలపెట్టకూడదని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థినులు, మహిళలు సాంప్రదాయ పాటలతో, చప్పట్లతో ఆడిపాడి, బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు. వేడుకల అనంతరం అందరికీ ప్రసాద వితరణ చేశారు.

మరిన్ని వార్తలు