కాంగ్రెస్ ధర్నా పొలిటికల్ డ్రామానే!
ముందస్తు బుకింగ్, అడ్వాన్స్ లేకుండా ప్రత్యేక రైళ్లను ఎలా కేటాయిస్తారు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకుల ధర్నా కేవలం పొలిటికల్ డ్రామా అని, ముందస్తు బుకింగ్, అడ్వాన్స్ లేకుండా ప్రత్యేక రైళ్లను ఎలా కేటాయిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(BJP state president Ramchander Rao) ప్రశ్నించారు. బుధవారం లోక్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి ర్యాలీ కోసం ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎటువంటి ముందస్తు బుకింగ్, ముందస్తు చెల్లింపులు లేకుండా ప్రత్యేక రైళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం కేవలం పొలిటికల్ డ్రామా అని మండిపడ్డారు.
స్పెషల్ ట్రైన్లు కేటాయించడానికి స్పష్టమైన నిబంధనలు, అధికారిక ప్రక్రియలు ఉంటాయని ఆయన గుర్తుచేశారు. అంతగా ఢిల్లీకి వెళ్లాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు టికెట్లు కొనుగోలు చేసి సాధారణ రైళ్లలో, విమానాలు, బస్సుల్లో వెళ్లవచ్చని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చేందుకే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దసరా నుంచి దీపావళి వరకు పండుగల సీజన్ నడుస్తోందని, సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే ప్రయాణికుల రద్దీ కోసం వెయ్యికిపైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోందన్నారు.