ఆధార్ కేంద్రాల్లో నిబంధనలకు తిలోదకాలు!
ప్రభుత్వ కార్యాలయాలకు బదులు ప్రైవేట్ మీ సేవా కేంద్రాల్లో నిర్వహణ
కరీంనగర్ జిల్లాలో ఇష్టారాజ్యంగా ఆధార్ సేవలు.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
హుజురాబాద్, అక్టోబర్ 29: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) మీ సేవా ఆధార్ కేంద్రాల నిర్వహణపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ఆధార్ నమోదు సేవలను ప్రైవేట్ మీ సేవా కేంద్రాల్లో(MeeSeva centers) నిర్వహిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్, కేశవపట్నం, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్ తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆధార్(Aadhaar Services) ఎన్రోల్మెంట్ నిర్వహించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ప్రైవేట్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆపరేటర్లను ప్రశ్నిస్తే అధికారులు అనుమతించారని సమాధానం చెబుతున్నారని, జిల్లా అధికారులను సంప్రదించినా నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆధార్ కేంద్రాలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులైన ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.