దర్శనానికి కుటుంబం.. ఇంట్లో దొంగల చేతివాటం!
కొత్తగూడెం, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం 15వ డివిజన్‌లో పట్టపగలే చోరీ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కార్పొరేషన్ పరిధిలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంతంలో నివాసముంటున్న ఎం. సతీష్ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలంలో స్వామివారి దర్శనానికి వెళ్లారు. స్థానికంగా పిండి మర దుకాణం నిర్వహించే సతీష్ మధ్యాహ్నం దుకాణాన్ని మూసివేసి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
ఇంట్లోని బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. బీరువాలో ఉన్న నాలుగు వెండి కడియాలు, రెండు బంగారు గొలుసులు, రూ.50 వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు.
వెంటనే స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సిబ్బందిని ఘటనాస్థలానికి పంపించి వివరాలు సేకరించారు. స్థానికంగా అనుమానితులను విచారించి, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రజలు అత్యవసర పనులపై బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు స్థానికులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌హెచ్‌ఓ సూచించారు. ఇళ్ల వద్ద నిఘా కోసం సీసీటీవీ (CCTV) కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చోరీల నియంత్రణకు, నేరాల దర్యాప్తునకు ఉపయోగపడుతుందని తెలిపారు. చోరీ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.