కరెంట్ కోసం కదం తొక్కిన రైతులు
కౌటాల,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad district) కౌటాల మండలంలో వ్యవసాయ విద్యుత్(Agricultural Electricity) సమస్యపై రైతులు ఆందోళన(Farmers Protest )కు దిగారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక పలు గ్రామాల్లో వరి పంటలకు సాగునీటి కొరత ఏర్పడిందని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న విద్యుత్ పంటలకు నీరందించేందుకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి రోజుకు 20 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. వర్షాభావ పరిస్థితులతో పంటలకు నీరందించడం కష్టంగా మారిందని రైతులు పేర్కొన్నారు. మోటార్ల ద్వారా పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ సరఫరా పెంచాలని కోరారు. సమయానికి సాగునీరు అందకపోతే పంటలు దెబ్బతిని పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి రోజుకు 20 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో మార్కెట్ రోజు కావడంతో ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. రైతులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సమస్యకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.