ఆహారంలో వినియోగించే కల్తీ వస్తువులను నివారించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్(విజయ క్రాంతి):జిల్లాలోని హోటళ్ళు, బేకరీలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలలో తయారుచేసే ఆహారంలో కల్తీ వస్తువులను వినియోగించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి హాజరై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హోటళ్ళు, బేకరీలు, తినుబండారాల షాపులను ఆహార భద్రత అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, కల్తీ వస్తువులను ఆహారంలో వినియోగించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాపారాల అనుమతులు, షాపుల రిజిస్ట్రేషన్లు తనిఖీ చేయాలని, కల్తీ వస్తువులను వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలలో ఆహారం తయారీలో వినియోగించే ముడి పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు, విష బాధ ఘటనలను నివారించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తనిఖీల సమయంలో లభించిన వస్తువులు, ఆయా వ్యాపార సంస్థల వివరాలు పత్రికలలో వచ్చే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సచ్చిదానంద చారి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి వాసు రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేందర్, వైద్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.