కరీంనగర్ కమిషనరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిపి గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం,(విజయ క్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్(Karimnagar Police Commissionerate) ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(CP Gaush Alam) ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, సీపీవో కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామిక భారత సమాఖ్యలో అంతర్భాగమైన చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, చట్టబద్ధ పాలన, సమాజ శాంతిభద్రతల పరిరక్షణే పోలీసు వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని అన్నారు. పౌరులందరికీ సత్వర న్యాయం అందించేందుకు, పారదర్శకతతో కూడిన పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.