ప్రజాపాలన విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఎమ్మెల్యే జీఎస్ఆర్
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజాపాలన విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం, ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, పట్టణ అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, తదితరులు పాల్గొన్నారు.