బాల్య వివాహాలకు చెక్‌పెట్టాలని గ్రామసభల్లో తీర్మానం

02-10-2026 | 11:07pm

కొత్తపల్లి, అక్టోబర్ 02 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు, బాలల రక్షణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ, కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో చైల్డ్ హెల్ప్‌లైన్–1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్(Coordinator Avula Sampath Yadav) పాల్గొని బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 ప్రకారం బాల్య వివాహాలను నిర్వహించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని వివరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువతతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు లేదా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని సూచించారు.

అనంతరం రామకృష్ణ కాలనీ, కొత్తపల్లి గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక తీర్మానం చేయించారు. బాల్య వివాహ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆవుల సంపత్ యాదవ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు