అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ
పోస్టర్, రూట్ మ్యాప్‌లను ఆవిష్కరించిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను(Martyrs' Memorial Week celebrations) పురస్కరించుకొని అక్టోబర్ 25 ఆదివారం రోజు నిర్వహించబోయే సైకిల్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్, రూట్ మ్యాప్‌లను కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి మొదలై బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్, కెమిస్ట్ భవన్ మీదుగా సాగి, ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకుంటుంది.
అనంతరం కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా ప్రయాణించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగుస్తుందని ఆయన వివరించారు. ఈ సైక్లింగ్ ర్యాలీ నగరంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర జరగనుందని సీపీ పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం కోరారు.