జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 6 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి..
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ నేతలు..
హుజూరాబాద్ అక్టోబర్02 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జర్నలిస్టులు(Journalists) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ మండిపడ్డారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట పాత్రికేయులు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక తహసీల్దార్ నరేందర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్త జర్నలిస్టుల సమస్యలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మీడియా రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి వెంటనే నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధ హక్కులను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పాత్రికేయుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం తక్షణమే నూతన వేజ్ బోర్డును ప్రకటించాలని, గతంలో నిలిపివేసిన రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూర్తిస్థాయి క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అందజేసి వైద్య భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణతో పాటు మీడియా వర్కింగ్ జర్నలిస్టుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నంబిని భరిణి కుమార్, నిమ్మటూరి సాయి కృష్ణ, కేదార్ సి శ్రీధర్ కుమార్, పబ్బ తిరుపతి, సత్యరాజ్, సతీష్ హుజూరాబాద్ పట్టణ, మండల పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.