ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ రాజకీయ డ్రామాలు

10-10-2026 | 07:09pm

ముకరంపుర, అక్టోబర్ 10(విజయక్రాంతి) : కరీంనగర్ లో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఉనికి కోసమే డ్రామా రాజకీయాలు చేస్తోందని కిసాన్ నగర్ 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్(BJP Corporator Somidi Venu Prasad) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్నవారినే కొత్తగా చేరికలంటు బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

కిసాన్‌నగర్‌ లో  బీఆర్‌ఎస్‌ లోకి చేరికలు జరిగినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సోషల్ మీడియా(Social Media)లో పబ్లిసిటీ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు సర్వస్వం గులాబీ మయం చేసుకున్న బీఆర్‌ఎస్ నేతలకు, ఇప్పుడు కాషాయ రంగును చూస్తే కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.టౌన్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ ఆ పదవికి అనర్హుడని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు ఆయనను తిరస్కరించారన్నారు. 

మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar), మాజీ మేయర్ రవీందర్ సింగ్,ఏడ్ల అశోక్,  కంసాల శ్రీనివాస్ తదితరుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కరీంనగర్‌ కిసాన్ నగర్ లో దళిత బంధు ఇళ్ళు ప్రొసీడింగ్స్ ల పేరుతో పేదల నుంచి వేల రూపాయలు వసూలు చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు  ఉన్నాయని,  దయచేసి వారందరికీ  తిరిగి డబ్బులు  ఇవ్వాలని కోరారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ వల్లే నగరంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ , స్మార్ట్ సిటీ ద్వారా భారీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రజా విశ్వాసం కోల్పోయి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ ఒక 'అవుట్‌డేటెడ్' పార్టీ అని, ఆ మునిగిపోయే నావలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరని విషయాన్ని బిఆర్ఎస్ నాయకత్వం  గ్రహిస్తే మంచిదన్నారు. కరీంనగర్లో ఇక  బి ఆర్ ఎస్ కు స్థానం లేదని రాబోయే రోజుల్లో  కరీంనగర్‌ అసెంబ్లీ లో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు రవీంద్ర భూపతి, మేకల వెంకటేష్, కర్రే పద్మా అనిల్, పొన్నం మొండయ్య, కార్యకర్తలు గాలి సురేష్, కళ్యాణ్, విష్ణు ప్రసాద్, పవన్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు