పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 27(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో రక్తదాన శిబిరాన్ని(Blood Donation Camp) నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందించడం ఎంతో కీలకమని తెలిపారు. రక్తదానం చేసే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అనంతరం వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది సేవలను స్మరించుకుంటామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను గౌరవించడం, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ రక్తదాన కార్యక్రమoలో ఏసీపీ లు శ్రీనివాస్, శ్రీనివాస్ జి, వెంకటస్వామి, విజయకుమార్, స్వామి పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి, ఆర్ఎంఓ, వైద్య బృందానికి, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.