విజయ క్రాంతి ఎఫెక్ట్.. గురుకులంలో నీటి సమస్యపై హామీ
విజయ క్రాంతి కథనానికి స్పందన..!
గురుకుల పాఠశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
తక్షణమే నీటి సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థినీలకు హామీ
బాన్సువాడ, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్య గుట్ట గురుకుల పాఠశాల(కొయ్య గుట్ట గురుకుల పాఠశాల)లో నెలకొన్న నీటి సమస్యపై ‘విజయ క్రాంతి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. విషయం వెలుగులోకి రావడంతో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్ హకీం, గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సరఫరా పరిస్థితి, విద్యార్థినీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ గంగాధర్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీబాయిని అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యపై విద్యార్థినీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, విద్యార్థినీలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు.
సంబంధిత సిబ్బందితో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినీల సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘విజయ క్రాంతి’ కథనంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. పత్రిక కథనంతో అధికారులు స్పందించి పాఠశాలను సందర్శించడం, సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం పట్ల విద్యార్థినీలు, ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట కౌన్సిలర్ హకీం, సిబ్బంది రవీందర్ ఉన్నారు.