నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
భిక్కనూర్, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): ఎల్ నినో ప్రభావం(impact of El Niño) నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి రైతులకు సూచించారు. శుక్రవారం భిక్కనూర్ మండలం రాగట్లపల్లి గ్రామంలో కూరగాయల పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి, సాగుకు అవసరమైన నీటి లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పంటలకు అవసరమైన నీరు సరిపోతుందని, కూరగాయల పంటలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు తెలిపారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జ్యోతి సూచించారు. నీటి వృథాను అరికట్టి పంటలను కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సుమన్, ఉద్యాన విస్తరణ అధికారి బాపురెడ్డి, సర్పంచ్ భాగ్యమ్మ నీలం రెడ్డి, స్థానిక రైతులు పాల్గొన్నారు.