బిల్లు తప్పు ఖాతాలో జమ
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి బిల్లుకు సంబంధించిన ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని గుండూర్ గ్రామానికి చెందిన సరుకురే అనిత.. తన ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు తన ఖాతాలో కాకుండా వేరే వ్యక్తి ఖాతాలో జమ అయిందని ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆమె ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించింది.
ఫిర్యాదుపై విచారణ చేపట్టి వివరాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అర్హతను నిర్ధారించిన అనంతరం ఇందిరమ్మ ఇంటి బిల్లు సంబంధిత లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, ఎంపీఓ రాము, వెటర్నరీ డాక్టర్ పండరి, ఎంఈఓ తిరుపతయ్యతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.