పేర్ల తొలగింపుపై ఎమ్మెల్యేల ఆగ్రహం
ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్య ద్రోహం
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి
జనగామ,(విజయక్రాంతి): ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari), పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) అన్నారు. ఓటరు జాబితాలో అక్రమంగా మార్పులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వారు విమర్శించారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న సవరణలు, పేర్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా(Voter List)లో అక్రమ సవరణలు చేయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు బీజేపీ కుట్రలో భాగంగానే జరుగుతోందని వారు ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి, జిల్లా ఇన్చార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, వైటీడీఏ మెంబర్ లకావత్ లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.