నేటితరం యువతకు భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం
ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు
భగత్ సింగ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ గౌడ్
ఆప్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): భగత్ సింగ్ జీవితం నేటితరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు(AAP State Convener Hema Sudarshan Jilloju) అన్నారు. షహీద్ భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ముందుగా విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ మాట్లాడుతూ భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగం యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందడానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ గౌడ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం, సమాజంలో సమానత్వ న్యాయం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనంతరం స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పరిక్షన్, బాబులాల్ పవార్, నేరాటి ఆంజనేయులు దర్శనం రమేష్, కొడంగల్ శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీనివాస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.