ప్రధాన రహదారి నుండి సంతను గ్రౌండ్‌లోకి తరలింపు

19-10-2026 | 08:52pm

గణపురం,(విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పరకాల–ములుగు ప్రధాన రహదారి వెంట నిర్వహిస్తున్న వారపు సంత(Weekly Market)ను సోమవారం గ్రౌండ్ ఆవరణలోకి తరలించారు.సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) చొరవతో సంత ఆవరణలో మట్టి తరలించి గ్రౌండ్‌ను వెడల్పు చేయడంతో సంత నిర్వహణకు అనుకూలంగా మారింది.

దీంతో రహదారి వెంట ఏర్పాటు చేస్తున్న దుకాణాల వల్ల తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్(Ganapuram SI Boragala Ashok) ఆధ్వర్యంలో పోలీసులు రహదారి వెంట ఉన్న దుకాణాలను సంత గ్రౌండ్‌లోకి తరలించారు.

సంతను గ్రౌండ్‌లోకి తరలించడంతో రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రమాదాల నివారణకు అవకాశం ఏర్పడిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇచ్చిన మాట ప్రకారం సంత గ్రౌండ్‌ను అభివృద్ధి చేసి దుకాణాలను అక్కడికి తరలించడంతో వ్యాపారులు, ప్రజలకు సౌకర్యంగా మారిందని తెలిపారు. గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు