పల్లె పల్లెల్లో వెలసే బొడ్డెమ్మ.. నేడు ఎక్కడమ్మా?

04-10-2026 | 02:58pm

బతుకమ్మకు బాటలు వేసిన బొడ్డెమ్మ.. కనుమరుగవుతున్న తెలంగాణ పల్లె సంప్రదాయం!

తొమ్మిది రోజుల పూజలు.. పూలతో ఆరాధనలు.. 

నైవేద్యాలతో సందడి.. నేటి తరానికి దూరమవుతున్న బొడ్డెమ్మ వేడుకలు

భూపాలపల్లి అక్టోబర్ 04 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana) సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. అయితే బతుకమ్మ సంబరాలకు ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగకు మాత్రం నేటి సమాజంలో ఆదరణ క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో చిన్నారులు, మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బొడ్డెమ్మ వేడుకలు నేడు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి ప్రభావంతో తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

తొమ్మిది రోజుల పాటు సందడే సందడి

గతంలో తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ సందడి ప్రారంభమయ్యేది. మట్టి, ఆవు పేడతో బొడ్డెమ్మను అందంగా రూపొందించి రంగురంగుల పూలతో అలంకరించేవారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం మహిళలు, బాలికలు ఒకచోట చేరి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటపాటలతో పూజలు నిర్వహించేవారు. రోజుకో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ పసుపు, కుంకుమలతో భక్తిగా ఆరాధించేవారు. చివరి రోజు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మకు వీడ్కోలు పలికేవారు.

ఆత్మీయతకు.. ఐక్యతకు ప్రతీక

బొడ్డెమ్మ పండుగ కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాదు. మహిళలు, చిన్నారుల మధ్య ఆత్మీయతను పెంచే సామూహిక వేడుక. వీధిలోని ప్రతి ఇంటి వారు ఇందులో భాగస్వాములయ్యేవారు. పెద్దలు పాటలు నేర్పిస్తే చిన్నారులు వాటిని అనుసరిస్తూ తెలంగాణ జానపద సంస్కృతిని నేర్చుకునేవారు. కుటుంబ బంధాలు, పొరుగువారి అనుబంధాలు బలపడటానికి ఈ వేడుకలు దోహదపడేవి.

ఆధునికతలో మరుగునపడుతున్న సంప్రదాయం

ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, పట్టణీకరణ, చిన్న కుటుంబాల విధానం, సంప్రదాయాల పట్ల అవగాహన తగ్గడం వంటి కారణాలతో బొడ్డెమ్మ వేడుకలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ప్రతి వాడలో కనిపించిన బొడ్డెమ్మలు నేడు చాలా ప్రాంతాల్లో కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బతుకమ్మకు ఇచ్చే ప్రాధాన్యతలో కొంతైనా బొడ్డెమ్మకు ఇవ్వకపోవడం ఈ సంప్రదాయం మరుగునపడటానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనదే!

తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగకు బొడ్డెమ్మ ఒక అందమైన ముందుమాట. అలాంటి సంప్రదాయాన్ని కేవలం పెద్దల జ్ఞాపకాలకే పరిమితం చేయకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గ్రామాలు, పట్టణాల్లో యువత, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంస్థలు ముందుకొచ్చి బొడ్డెమ్మ వేడుకలను ప్రోత్సహించాలి. పాఠశాలల్లోనూ చిన్నారులకు ఈ పండుగ విశిష్టతను తెలియజేయాలి.

బతుకమ్మ సంబరాలు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో.. ఆ బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ వేడుకలను కూడా అంతే వైభవంగా నిర్వహించాలి. లేదంటే రేపటి తరానికి బతుకమ్మ మాత్రమే మిగిలి, దానికి ముందుగా జరుపుకునే బొడ్డెమ్మ సంప్రదాయం చరిత్ర పుటల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి.. బొడ్డెమ్మకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలి.

మరిన్ని వార్తలు