ప్రజా పాలన కాదు.. పోలీస్ పాలన

16-09-2026 | 05:25am
  1. హమీల అమలులో రేవంత్ ఫెయిల్
  2. బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress) పాలన కేసుల పాలనగా మారిందని బీఆర్‌ఎస్ నేత ఏ జీవన్‌రెడ్డి (BRS leader A. Jeevan Reddy) మండిపడ్డారు. ప్రతిపక్షాలను వేధించడంలో రేవంత్‌రెడ్డి పాలన పరాకాష్ఠకు చేరిందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు..

పోలీస్ పాలన అని వరసగా జరుగుతున్న దురాగతాలు రుజువు చేస్తున్నాయని, ఇందిరమ్మ రాజ్యం కాదు ఇదేమి రాజ్యం అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చిటికె వేస్తే సీఎం, మంత్రులు, కాంగ్రెస్ వాళ్లు ఊర్లలో తిరగలేరు అని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై కుట్రలు చేస్తే తెలంగాణ అగ్ని గుండం అవుతుందన్నారు.

కేటీఆర్ పీఆర్వో, పీఏలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు తప్పవని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. దళితులతో దాడులు చేయిస్తామని బల్మూరి వెంకట్ అంటున్నారు..ఏమైనా వారు నీకు బానిసలా అని ప్రశ్నించారు.

హమీల అమలులో ఫెయిలైన రేవంత్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రేవంత్ చిల్లర మాటలకు తగిన బుద్ది చెబుతామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు బాలరాజు యాదవ్, బొమ్మెర రామమూర్తి, కిషన్ రావు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు