నేటి చలో హైదరాబాద్ వాయిదా

10-09-2026 | 05:05am
  1. ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ జేఏసీ నేతలు
  2. డిమాండ్లపై సీఎస్ లిఖితపూర్వక హామీ
  3. పీఆర్సీ రిపోర్టు సమర్పించాలని కమిషన్ చైర్మన్‌కు ప్రభుత్వం లేఖ
  4. సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ
  5. డీఏలు, పెండింగ్ బిల్లులపై 18న సీఎస్‌తో ప్రభుత్వం చర్చలు 
  6. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే 19న జేఏసీ భవిష్యత్ కార్యాచరణ
  7. మీడియా సమావేశంలో ఉద్యోగ జేఏసీ నేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, ఈహెచ్‌ఎస్ స్కీంను సమర్థవంతంగా అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, 11 వేల కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తలపెట్టిన చలో హైదరాబాద్ ఉద్యోగుల భారీ బహిరంగ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు(Telangana Employees JAC leaders) ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఉద్యోగ జేఏసీ నేతలు సమావేశమై తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ క్రమంలోనే పీఆర్సీ కమిషన్ వెంటనే రిపోర్టును సమర్పించాలని, సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు కోసం నిపుణులు, అధికారులు, ఉద్యోగ సంఘాలతో అధ్యయన కమిటీ వేస్తామని, ఈనెల 18న సీఎస్‌తో పెండింగ్ ఆరు డీఏలు, పెండింగ్ బిల్లులపై సమావేశం నిర్వహిస్తామని లిఖిత పూర్వక హామీని ప్రభుత్వం ఇవ్వడంతో చలో హైదరాబాద్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు వెల్లడించారు. సీఎస్‌తో సమావేశ అనంతరం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు వివరాలు వెల్లడించారు. 

జేఏసీ వెనుకడుగు వేయదు: మారం జగదీశ్వర్, ఉద్యోగుల జేఏసీ చైర్మన్

మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలని కమిషన్‌ను కోరుతూ సీఎస్ లేఖ రాశారని తెలిపారు. సీపీఎస్ రద్దు పునరుద్ధరణ డిమాండ్‌పై అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు సమ్మతించారని చెప్పారు. పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక అంశాలపై ఈనెల 18న జేఏసీ నాయకత్వంతో చర్చిస్తామని మాటిచ్చినట్టు తెలిపారు.

ఆర్థికేతర సమస్యలన్నీ ఈనెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 18న జరిపే చర్చల తర్వాత జేఏసీ19న అత్యవసర సమావేశమై మరోసారి చర్చించి అవసరమైతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. సీఎస్ విజ్ఞప్తి మేరకు కేవలం తాత్కాలికంగా తమ ఆందోళన కార్యక్రమాన్ని వాయిదావేశామే తప్ప విరమించలేదని తేల్చి చెప్పారు.

దసరా వరకు పీఆర్సీ ఇప్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవని, అయితే సీఎస్, డిప్యూటీ సీఎం సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరినట్లు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వమే ఒక ప్రకటనను విడుదల చేయడమనేది ఉద్యోగుల విజయంగా భావించాలన్నారు.

క్షేత్రస్థాయలో ఉద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, యుద్ధం చేయడం వల్ల రెండు వైపుల నష్టపోతారని, ఉద్యోగుల హక్కులకై పోరాటంలో జేఏసీ వెనుకడుగు వేయదని, అయితే ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈనెల 18న సమస్యలు పరిష్కారం కాకుంటే యథావిధిగా తాము ఉద్యమ బాట చేపడతామన్నారు. చలో హైదరాబాద్‌తో ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది తలెత్తొద్దని, పైగా ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని, ఈసారికి ప్రభుత్వానికి ఒక అవకాశమివ్వాలనే నిర్ణయంతోనే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 

కనీసం మూడు డీఏలు ఇవ్వాలి: ఏలూరి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్

సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకుని పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, ఓపీఎస్ అమలు చేయాలన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ, ఆఫీసర్ల కమిటీలతో పలు దఫాలుగా చర్చించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అనివార్యంగా చలో హైదరాబాద్ తలపెట్టినట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటనకు ముందే చలో హైదరాబాద్ ఉంటుందని ప్రకటించామని గుర్తుచేశారు. అసెంబ్లీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అయినా సరే సభకు అనుమతించాలని కోరినప్పటికీ ప్రభుత్వం అనుమతించకపోవడంతో చివరకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్టు తెలిపారు.

ఈ లోపు సీఎస్ ఆహ్వానం మేరకు చర్చించామనీ, ఆ సందర్భంగా పీఆర్సీతో పాటు కనీసం మూడు డీఏలు ఇవ్వాలనీ, రూ.11 వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిలున్నాయని ఆయనకు తెలిపినట్టు వివరించారు. 18 లోపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు అయ్యేంత వరకు ఓపిక పట్టాలని సీఎం కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

పీఆర్సీ, డీఏలు ప్రకటించాలి: పుల్గం దామోదర్ రెడ్డి, జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్

ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపామని జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమస్యల పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నారని పేర్కొన్నారు. పీఆర్సీ గడువు ఇప్పటికే ముగిసిపోయిందని, వెంటనే ఆ రిపోర్టును తెప్పించుకోవాలని, డీఏలను కూడా ప్రకటించాలన్నారు. ఓపీఎస్‌ను అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించకుంటే, 18న స్పష్టత రాకుంటే పోరాట కార్యాచరణపై జేఏసీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి: -ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి

18న ప్రభుత్వం నుంచి స్పష్టత  రాకుంటే తమ పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ పేర్కొన్నారు. ఇప్పటికే మూడుసార్లు జేఏసీ పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చి వాయిదా వేసిందని గుర్తుచేశారు.

చలో హైదరాబాద్‌కు రెండున్నర లక్షల మందికి పైగా రావడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ప్రభుత్వం మొదటిసారిగా రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని తెలిపారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు చావ రవి, సదానంద గౌడ్, మధుసూదన్ రెడ్డి, బీ శ్యామ్,  కటకం రమేష్, పీ వెంకటరెడ్డి,  గౌతమ్‌కుమార్,  కృష్ణమూర్తి, దాస్య నాయక్, చకినాల అనిల్ కుమార్, వెంకట్, అబ్దుల్లా, గజేందర్, ఉమారెడ్డి, క్రిష్ణయాదవ్ తదితరులు పల్గొన్నారు. 

క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఆగ్రహం..

ఇదిలాఉంటే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడంపై క్షేత్రస్థాయిలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు.. ఉద్యోగుల జేఏసీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సింది లేఖలు, కమిటీ లు, చర్చలు కాదని.. సమస్యలకు పరిష్కారమని వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నిస్తున్నారు. జేఏసీ వెంట నడవదానికి, ఉద్యమం చేయడానికి లక్షల సైన్యం సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమాన్ని వాయిదావేసామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని నిలదీస్తున్నారు. గత కొన్ని రోజులుగా చలో హైదరాబాద్ అంటూ రెచ్చగొట్టి, ఇప్పుడు ఏం చేశారం టూ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఈనెల 18న ఒరిగే ది ఏమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సభ వాయిదాపడిందేమో కానీ, ఉద్యోగుల ఆగ్రహం వాయిదా పడలేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు