ఘోర రోడ్డు ప్రమాదం
లారీ చక్రాల కింద పడి మల్లేపల్లి యువకుడి మృతి
మంథని, అక్టోబర్ 26(విజయక్రాంతి): మంథని పట్టణంలో(Manthani Town) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పాత పెట్రోల్ పంపు సమీపంలో జరిగిన ప్రమాదంలో మల్లేపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్ (28) ప్రాణాలు కోల్పోయాడు. లారీ ఢీకొనడంతో అదుపుతప్పి లారీ చక్రాల కింద పడిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. చిన్న వయసులోనే నవీన్ మృతిచెందడంతో మల్లేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. చేతికందిన వయసులో యువకుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.