ఆన్లైన్ వేధింపులు.. ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి
చెన్నై: పుదుచ్చేరికి చెందిన ప్రముఖ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ వి. హరీష్ మృతి సోషల్ మీడియా వర్గాల్లో కలకలం రేపింది. ‘ఫైనాన్స్ విత్ హరీష్’ పేరుతో ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై వీడియోలు రూపొందించే ఆయన మృతి నేపథ్యంలో ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా వేదికల బాధ్యతపై చర్చ మొదలైంది.
వి. హరీష్ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, పొదుపు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలను వివరిస్తూ గుర్తింపు పొందారు. ఐదేళ్లుగా కంటెంట్ క్రియేటర్‌గా కొనసాగుతూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేయడం, ఆర్థిక సలహాలు ఇచ్చేందుకు అవసరమైన అర్హతలు, అనుమతులపై వివాదం తలెత్తినట్లు సమాచారం.
ఆన్లైన్ వేధింపులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు
హరీష్ మృతి నేపథ్యంలో ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంటెంట్ క్రియేటర్ జేసన్ శామ్యూల్ తన కుమారుడిని ఆన్లైన్లో వేధించారని, అవమానకరమైన ప్రచారం చేశారని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను జేసన్ శామ్యూల్ ఖండించారు. తన ఉద్దేశం హరీష్ ఆర్థిక సలహాలకు సంబంధించిన అర్హతలు, నియంత్రణ నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆరోపణలు, సంబంధిత వ్యక్తి వివరణతో పాటు ఘటనకు సంబంధించిన పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సైబర్ వేధింపులపై మరోసారి చర్చ
ఈ ఘటనతో సోషల్ మీడియాలో వ్యక్తులపై చేసే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, నిరంతర ఆన్లైన్ వేధింపుల ప్రభావంపై మరోసారి చర్చ మొదలైంది. ఆన్లైన్లో అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.