హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణం.. తోటి విద్యార్థుల ఆందోళన
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆదిభట్ల,(విజయక్రాంతి): ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని లా మెంటోరా కళాశాల హాస్టల్(La Mentora College Hostel)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య(Student Suicide)కు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. కందుకూరుకు చెందిన విద్యార్థి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. జ్వరం రావడంతో సోమవారం హాస్టల్ గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
రాత్రి సమయంలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యంపై పలు ఆరోపణలు చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.