చందాపూర్‌లో బోల్తాపడిన భారీ లారీ
సిద్దిపేట (Siddipet) జిల్లాలో భారీ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. తొగుట మండలం చందాపూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా (Truck Overturn) పడింది. అయితే డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం కూడా సంభవించలేదు.
కాగా, హైదరాబాద్-సిద్దిపేట ప్రధాన రహదారిపై టోల్ ఫీజు (Toll Fee) తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు తొగుట మీదుగా గజ్వేల్ వైపు వెళ్లే అంతర్గత రహదారిని ఎంచుకుంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటంతో పాటు మలుపులు ఎక్కువగా ఉన్నాయని, భారీ వాహనాల రాకపోకలతో తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు రహదారిపై వేగ నిరోధకాలు (Speed Breakers) ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డులు, నిఘా కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.