బ్యాంకు ఖాతా లేకున్నా నగదు పంపొచ్చు
బ్యాంకు ఖాతా లేకున్నా డబ్బులు పంపొచ్చు.. RBI విధించిన Limits ఇవే!
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతా లేకపోయినా ఇతరుల ఖాతాల్లోకి నగదు పంపించవచ్చని మీకు తెలుసా? అయితే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకేసారి ఎంత డబ్బు పంపవచ్చు? నెలకు గరిష్ఠంగా ఎంత బదిలీ చేయొచ్చు? ATM, బ్యాంకు ప్రతినిధుల ద్వారా ఎంత పంపొచ్చు? అనే విషయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. నవంబర్ 11, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త Domestic Money Transfer (DMT) Directions ద్వారా గతంలో ఉన్న పరిమితులను కొనసాగిస్తూనే అదనపు భద్రతా చర్యలను తప్పనిసరి చేసింది.
బ్యాంకు ఖాతా లేని వ్యక్తి నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి ఇతరుల ఖాతాలో నగదు జమ చేయాలనుకుంటే NEFT (National Electronic Funds Transfer) సేవను ఉపయోగించుకోవచ్చు. ఈ విధానంలో ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.50,000 వరకు పంపేందుకు అవకాశం ఉంది. అయితే Business Correspondents (BCs), ATMలు లేదా ఇతర అనుమతించిన మార్గాల ద్వారా పంపితే ఒక్కో లావాదేవీకి రూ.5,000 మాత్రమే పరిమితి. ఒక వ్యక్తి నెల మొత్తంలో ఈ మార్గాల ద్వారా పంపే నగదు రూ.25,000కు మించకూడదు.
మరోవైపు, డబ్బు పంపే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండి, డబ్బు అందుకునే వ్యక్తికి ఖాతా లేకపోతే Cash Pay-out Service ద్వారా నగదు అందించవచ్చు. ఈ సేవను ATMలు, బ్యాంకు ప్రతినిధులు లేదా ఇతర అనుమతించిన మార్గాల్లో పొందవచ్చు. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే పంపాలి. ఒక నెలలో ఒక లబ్ధిదారుడికి అందించే మొత్తం రూ.25,000కు మించకూడదు.
మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త Security Rules కూడా అమల్లోకి వచ్చాయి. నగదు పంపే వ్యక్తి మొబైల్ నంబర్‌ను బ్యాంకు ధ్రువీకరించాలి. KYC నిబంధనల ప్రకారం అధికారిక గుర్తింపు పత్రం (OVD) వివరాలను నమోదు చేయాలి. అంతేకాకుండా ప్రతి లావాదేవీకి Additional Factor of Authentication (AFA) తప్పనిసరిగా ఉండాలి. NEFT, IMPS లావాదేవీల్లో నగదు పంపిన వ్యక్తి వివరాలతో పాటు, అది Cash-based Remittance అని గుర్తించే ప్రత్యేక గుర్తింపు కూడా ఉండాలి. అంతేకాదు, ఒక బ్యాంకు ఖాతాలోకి అనూహ్యంగా ఎక్కువ మొత్తంలో నగదు జమ అవుతున్నా, అనుమానాస్పద లావాదేవీలు కనిపించినా బ్యాంకులు వెంటనే పరిశీలించాలి. అవసరమైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. లావాదేవీలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బ్యాంకుల మధ్య నగదు బదిలీలు RBI ఆమోదించిన Payment Systems ద్వారానే జరగాలి.
ఈ మార్గదర్శకాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, అనుమతి పొందిన Payment System Operatorsకు వర్తిస్తాయి. అయితే Card-to-Card Transfers ఈ నిబంధనల పరిధిలోకి రావు. కాబట్టి ఖాతా లేకుండా నగదు పంపే ముందు సంబంధిత పరిమితులు, గుర్తింపు ధ్రువీకరణ, బ్యాంకు విధానాలను తెలుసుకోవడం మంచిది.