కీలక పదవుల నుంచి నోయెల్ టాటా అవుట్
టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా కుటుంబ సభ్యుడు నోయెల్ టాటా పలు కంపెనీల్లోని కీలక పదవుల నుంచి వైదొలిగారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (Tata Investment Corporation) చైర్మన్, డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో 16 ఏళ్లకు పైగా సాగిన ఆయన సారథ్యానికి ముగింపు పలికారు. ఆయన సేవలకు గుర్తింపుగా కంపెనీ బోర్డు 'చైర్మన్ ఎమెరిటస్' (Chairman Emeritus)గా గౌరవప్రదంగా నియమించింది.
టాటా గ్రూప్ పాలనా మార్గదర్శకాల ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లకు 70 ఏళ్లను పదవీ విరమణ వయసుగా నిర్దేశించారు. ఈ నెలలో నోయెల్ టాటా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. నిన్నటితో ఆయన పదవీకాలం ముగియగా, ఆయన స్థానంలో ప్రముఖ కార్పొరేట్ న్యాయవాది, ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్ సహ వ్యవస్థాపకుడు బహ్రామ్ వాకిల్ నేటి నుంచి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నోయెల్ టాటా నాయకత్వంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించడంతో పాటు వాటాదారులకు సుస్థిరమైన విలువను అందించిందని కంపెనీ ఒక ప్రకటనలో కొనియాడింది.
కొత్త చైర్మన్‌గా నియమితులైన బహ్రామ్ వాకిల్ కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ, దివాలా చట్టాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటి రంగాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనతో పాటు నియోస్ట్రాట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకుడు అబిజర్ షబ్బీర్ దివాంజీని అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి బోర్డు నియమించింది.
ఈ మార్పులు కేవలం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్‌కే పరిమితం కాలేదు. వయోపరిమితి కారణంగా నోయెల్ టాటా ట్రెంట్ (Trent), వోల్టాస్ (Voltas), టాటా ఇంటర్నేషనల్ సంస్థల చైర్మన్ పదవుల నుంచి కూడా తప్పుకున్నారు. ట్రెంట్ కొత్త చైర్మన్‌గా బహ్రామ్ వాకిల్, వోల్టాస్ సారథిగా సునీల్ డిసౌజా, టాటా ఇంటర్నేషనల్ చైర్మన్‌గా టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే, గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్‌గా, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకం, నాయకత్వ మార్పులు, పాలనాపరమైన అంశాలపై గ్రూప్‌లో చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ పదవీ విరమణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.